నేనింతే... అంటున్న ఐకెపి కమ్యూనిటీ సర్వేయర్ క్లింకారా న్యూస్ జూలై 17
నేనింతే...
అంటున్న ఐకెపి కమ్యూనిటీ సర్వేయర్
క్లింకారా న్యూస్ జూలై 17
ఖమ్మం జిల్లా సర్వే AD(S&LR)కి మానవ హక్కుల కమిషన్ నోటీసులు
• సత్తుపల్లి కమ్యూనిటీ సర్వేయర్‌పై తీరుపై తీవ్ర ఆరోపణలు
• రెండేళ్ల క్రితం ఇతర మండలానికి బదిలీ అయినా సత్తుపల్లిలోనే కొనసాగాడని అభియోగాలు
• తహసిల్దార్ అండదండలతో మళ్ళీ 25 మార్చి 2025 ఇదే తహసిల్దార్ కార్యాలయానికి డిప్యూటేషన్ మీద రాక
• నాలా కన్వర్షన్ లో లోపాలు - కాసులు ఇస్తేనే సర్వేలు
• రైతులకు నోటీసులు ఇవ్వకుండానే అక్రమ సర్వేలు – కోర్టు ఆదేశాల విస్మరణ
• హైకోర్టు ఆదేశాలపై నిర్లక్ష్యం – కంటెంప్ట్ కేసులు నమోదు
• రైతుల భూములకు ఫారెస్ట్ ట్యాగ్ – తప్పుడు నివేదికలు
• బేతుపల్లి గ్రామం సర్వేనెంబర్ 133 లో రీ సర్వేల సమయంలో కూడా ఇతని చేతివాటం ఉందని ఆరోపణలు
• జూనియర్ స్టాఫ్‌పై ఆరోపణలు – కార్యాలయంలో విభేదాలు
• దళితులపై వివక్ష, అంబేద్కర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యల ఆరోపణ
• ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ ఫిర్యాదు పై కమిషన్ విచారణ ఆదేశం
• జిల్లా సర్వే AD(S&LR)కి 29 ఆగస్టు కమిషన్ ఎదుట హాజరు ఆదేశం
• ప్రజల డిమాండ్ – డిప్యూటేషన్ రద్దు కోరుతూ,కఠిన చర్యలు
, సత్తుపల్లి, జూలై 17:
ఖమ్మం జిల్లా సర్వే శాఖలో కమ్యూనిటీ సర్వేయర్ తీరుపై మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం
ఖమ్మం జిల్లా సర్వే శాఖకు చెందిన సత్తుపల్లి మండల ఐకెపి కమ్యూనిటీ సర్వేయర్ విధుల నిర్వహణలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించాడన్న ఆరోపణల నేపథ్యంలో, మానవ హక్కుల పరిరక్షణ సంస్థ తీవ్రంగా స్పందించింది. ఈ అంశాన్ని పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, ఖమ్మం జిల్లా సర్వే అసిస్టెంట్ డైరెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. ఆయనను వచ్చే ఆగస్ట్ 29, 2025న తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఎదుట హాజరుకావాలని ఆ కమిషన్ ఆదేశించింది.
•సర్వీసు నిబంధనలో ఉల్లంఘన – స్థానిక ప్రజలు ఆందోళన:
సత్తుపల్లి మండలానికి చెందిన స్థానికుడైన ఓ వ్యక్తి, మొదటగా 2020లో ఐకెపి కమ్యూనిటీ సర్వేయర్‌గా సత్తుపల్లి మండల రెవెన్యూ కార్యాలయంలోనే చేరి, కొన్ని సంవత్సరాల తరువాత ఖమ్మం రూరల్ మండలానికి బదిలీ అయినప్పటికీ, నియమాలకు విరుద్ధంగా జిల్లా సర్వే అధికారుకంటే లెక్కలేకుండా సత్తుపల్లి తహసిల్దార్ కార్యాలయంలోనే కొనసాగాడని ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఇతను ఇటీవలే 2025 మార్చి 25న సత్తుపల్లి తహసిల్దార్ కార్యాలయానికి డిప్యూటేషన్ ద్వారా కమ్యూనిటీ సర్వేయర్‌గా మళ్లీ చేరాడని ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ గత రెండు సంవత్సరాలుగా ఇతను ఇదే కార్యాలయంలో కొనసాగుతూ తన ఇష్టానుసారంగా మండల సర్వేయర్ తో కలిసితన ఇష్టానుసారంగా భూములపై సర్వేలు చేయడం తప్పుడు నివేదికలు తయారు చేస్తున్నాడని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతనిపై వచ్చిన అనేక ఫిర్యాదులను మండల తహసిల్దార్ పట్టించుకోకపోవడం, ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. సర్వే శాఖలో నియమాల పాలన గల్లంతవుతుందన్న అనుమానం జనం మధ్య గట్టిగా వినిపిస్తోంది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు గమనించాలని సత్తుపల్లి పట్టణ ప్రజలు బాధిత రైతులు కోరుతున్నారు.
• నాలా కన్వర్షన్‌లో లోపాలు – కాసులు ఇస్తేనే సర్వేలు:
స్థానిక సత్తుపల్లి పట్టణంలో నివసిస్తున్న దిగువ, మధ్య తరగతి ప్రజలు తమ వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చుకోవాలంటే, సంబంధిత కమ్యూనిటీ సర్వేయర్‌ను కార్యాలయంలో చూసి భయపడే పరిస్థితి నెలకొంది. ఫిజికల్ గా భూమి సర్వే నెంబర్ ఒకటిగా, రెవెన్యూ రికార్డుల్లో మరో నెంబర్‌గా ఉండటం గుర్తించిన క్షణమే, సమస్యను పరిష్కరించేందుకు లక్షల్లో డిమాండ్ చేస్తున్నాడని బాధితులు వాపోతున్నారు. నేరుగా డబ్బులు అడగడం, లేదంటే సర్వే పని పట్టించుకోకపోవడం తరచూ జరుగుతోందని స్థానికుల ఆరోపణ. చట్టబద్ధమైన విధానాలు పాటించాల్సిన సర్వే శాఖలో ఈ విధంగా అవకతవకలు జరగటం పట్ల ప్రజలు విచారకరం వ్యక్తపరుస్తున్నారు.అధికారుల నిఘా సరిగా లేకపోవడంతోనే ఇలాంటి అక్రమాలు పెచ్చెత్తుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు.
కలెక్టర్ ఆదేశంతో బేతుపల్లిలో రీ సర్వేలు – రికార్డు లేని పాస్ పుస్తకాలు, అంతర్గత విభేదాల కలకలం
ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇటీవల బేతుపల్లి రెవెన్యూ గ్రామంలో భూములపై రీ సర్వేలు నిర్వహించబడ్డాయి. ఈ రీ సర్వేల్లో కమ్యూనిటీ సర్వేయర్ కూడా భాగంగా ఉన్నాడు. అయితే, సర్వే పనుల సమయంలో అతను తోటి సిబ్బందితో సహకరించకుండా అంతర్గత విభేదాలకు పాల్పడ్డాడని ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఇంకా, గ్రామంలో వాస్తవంగా భూములు లేకుండా పాస్ పుస్తకాలు (EPPB) పొందిన వారికి అండగా వారి సహకారంతో తప్పుడు సర్వేలు చేసినట్టు సమాచారం. ఈ చర్యలవల్ల సర్వే ప్రక్రియపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అధికారిక రికార్డుల ద్వారా ధృవీకరించని దరఖాస్తుదారుల భూములకు అక్రమంగా నకిలీ పాస్ పుస్తకాలు మంజూరు అవడంలో ఇతని పాత్ర ఉందని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
సర్వేలో మోసాలు – కోర్టు ఆదేశాలు – కంటెంప్ట్ కేసులు
కొమ్మేపల్లి గ్రామ రెవిన్యూ పరిధిలో సర్వే నెంబర్ 132 లో భూములు ఉన్నాయని, సర్వే నెంబరు 150 లో భూములు లేవన్న స్పష్టత గ్రామ నక్షలో ఉన్నా, అక్కడి భూములపై అధికారుల ఆదేశాలు లేకుండా అక్రమ సర్వేలు చేసినట్టు ఆరోపణలున్నాయి. లింగపాలెం గ్రామానికి చెందిన దళిత రైతుల భూములను కబ్జా చేసేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్న వేళ, వీరికి అండగా వ్యవహరించాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాధితులు హైకోర్టును ఆశ్రయించి రెండు పర్యాయాలు ఇంటర్మ్ ఆదేశాలు (WP27431/2023, WP15290/2023) తెచ్చుకున్నప్పటికీ, ఇతను అవేమీ పట్టించుకోకుండా సత్తుపల్లి మండల సర్వేయర్‌తో కలిసి మరలా అదే ప్రాంతంలో సర్వే చేయబోయిన సందర్భాలు చోటుచేసుకున్న వేళ, రెండుసార్లు రెండు సంవత్సరాల కాలంలో (2023, 2024) ఇద్దరు మండల తహసీల్దారుల పైన కంటెంప్ట్ కేసులు CC1358/2023, CC387/2024 నమోదు అయ్యాయి. ఇట్టి కంటెంప్ట్ కేసుల నుండి తహసిల్దారులను తప్పించడానికి, గతంలో ఇక్కడి రైతుకు మండల సర్వేయర్ సాగు భూమి గుర్తిస్తూ నక్ష ఇచ్చినా కూడా, అట్టి రైతుల భూములను ఫారెస్ట్ భూములుగా మరల చిత్రీకరిస్తూ తప్పుడు సర్వే రిపోర్టు తయారుచేసి ఖమ్మం జిల్లా కలెక్టర్‌కు, గౌరవ హైకోర్టుకు పంపిన వైనం. ఈ ఘటనలన్నీ ఇప్పటికే జరిగిపోయినవే.
• కార్యాలయంలో విభేదాలు – చాడీలు, వివక్ష, అభ్యంతరకర వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు:
సత్తుపల్లి మండల తహసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న కమ్యూనిటీ సర్వేయర్ వ్యవహారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇతనికి సహకరించని జూనియర్ అసిస్టెంట్లపై, వారు కార్యాలయానికి సంబంధించిన సమాచారాన్ని బయటకు లీక్ చేస్తున్నారని మండల తహసీల్దార్‌కు చాడీలు చెప్పినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై తహసీల్దార్ చర్యలు తీసుకుని, సంబంధిత జూనియర్లను అధికారికంగా బహిరంగంగా దూషించిన సంఘటనలు కార్యాలయంలోని ఇతర సిబ్బందిని తీవ్ర నిరాశకు గురి చేశాయి.
కార్యాలయానికి బాధ్యతలు స్వీకరించే ప్రతి నూతన తహసిల్దారుతో అతని సంబంధాలు బలపడటానికి అతిథి మర్యాదలు చేయడంలో ముందుండడమే కాకుండా,
కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్లు తన మాట వినకపోతే మండల తహసీల్దారులకు జూనియర్ అసిస్టెంట్ల గురించి చెడుగా చెబుతూ(కార్యాలయంలోని సమాచారాన్ని ప్రైవేటు వ్యక్తులకు చేరవేస్తారని చాడీలు చెబుతూ) అధికారుల చేత తిట్టిస్తూ ఆనందపడేవాడని ఆఫీసు వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇతను కాపు సామాజిక వర్గానికి చెందినవాడన్న కారణంగా, కార్యాలయానికి వచ్చే దళితులు మరియు సాధారణ ప్రజల పట్ల వివక్ష చూపిస్తూ ప్రవర్తిస్తున్నాడన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అంబేడ్కర్ వంటి గొప్ప నేతల పట్ల తక్కువచూపు చూపిస్తూ, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడాన్ని కార్యాలయంలో పలువురు స్వయంగా విన్నట్టు వెల్లడించగా, దాంతో అక్కడికి వచ్చే ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఈ వ్యవహారాలపై సంబంధిత శాఖాధికారులు స్పందించాలని, శాఖలో సవ్యమైన పరిపాలన ఉండాలంటే ఇలాంటి వ్యవహారశైలి గల సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
• జాతీయ మానవ హక్కుల సంస్థ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ అధ్యక్షుడు స్పందన – రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ జోక్యం:
సత్తుపల్లి మండలంలో జరుగుతున్న అక్రమ సర్వేలు, దళితులపై వివక్ష, కోర్టు ఆదేశాల ఉల్లంఘన వంటి ఘటనలపై జాతీయ మానవ హక్కుల ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ తీవ్రంగా స్పందించింది. ఈ అంశాన్ని ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ సత్తుపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు యాదాల శ్రీనివాస్ స్వయంగా పరిశీలించి, తగిన ఆధారాలతో తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా స్పందించిన మానవ హక్కుల కమిషన్, ఆర్భాటంగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. దళితుల పట్ల వివక్ష, న్యాయస్థానాల ఆదేశాలను గౌరవించకపోవడం, రెగ్యులర్ విధానాలకు విరుద్ధంగా అక్రమ సర్వేలు నిర్వహించడం వంటి అంశాలను తక్షణమే పరిశీలనకు తీసుకుని, దీనిపై విస్తృత విచారణ జరిపేందుకు చర్యలు ప్రారంభించింది.
ఇందుకు అనుగుణంగా, ఖమ్మం జిల్లా సర్వే శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (AD–S&LR)కి నోటీసులు జారీ చేసిన కమిషన్, వచ్చే నెల 29న తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఎదుట స్వయంగా హాజరై వివరాలు సమర్పించాలని ఆదేశించింది.
ఈ చర్యలతో, ఇప్పటి వరకు నిర్లక్ష్యంగా సాగిన వ్యవహారం బయటపడుతుండగా, బాధిత రైతులు, స్థానిక ప్రజల్లో కొంత న్యాయనిర్ణయం దక్కుతుందన్న నమ్మకాన్ని కలిగించింది. ఈ చర్యలతో సంబంధిత శాఖల దృష్టి మరలే అవకాశం ఏర్పడింది.
• తక్షణమే బాధ్యులపై చర్యలు:
సర్వే నిబంధనలను పట్టించుకోకుండా, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న కమ్యూనిటీ సర్వేయర్‌ను సత్తుపల్లి తహసిల్దార్ కార్యాలయం నుంచి తొలగించాలని, అలాగే అతని డిప్యూటేషన్‌ను రద్దు చేసేలా ఖమ్మం జిల్లా సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అక్రమంగా మరియు అన్యాయంగా భూసంబంధ విషయాల్లో ప్రవర్తిస్తున్న ఈ విధమైన ఉద్యోగులపై జిల్లా ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి.
Comment List