సామాజిక ఉద్యమ ధీరుడు ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ కన్నుమూత ప్రముఖుల ఘన నివాళి
సామాజిక ఉద్యమ ధీరుడు ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ కన్నుమూత
ప్రముఖుల ఘన నివాళి
క్లింకారా న్యూస్ జూలై 16
జనగామ వైద్య కళాశాలకు ప్రభంజన్ పార్థీవ దేహం
సామాజిక ఉద్యమ నాయకుడు, అట్టడుగు వర్గం నుండి ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసు సాధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేసి తెలంగాణ కోసం ఉద్యోగాన్ని వదిలి తెలంగాణ కోసం అలుపెరుగని పోరాటం చేసిన ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ సామాజిక తెలంగాణ సాధన కోసం తుది శ్వాస వరకు పోరాటం చేసి బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు.
జనగామ జిల్లా
పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో ఒక సామాన్య గొర్రెల కాపరి యాదవ కుటుంబంలో యాదనాల కొమరమ్మ సోమయ్య దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించిన డాక్టర్ యాదనాల ప్రభంజన్ యాదవ్ మొట్టమొదటి సారిగా గ్రామం నుండి ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ సాధించి ఆల్ ఇండియా రేడియో నందు విధులు నిర్వహించి, న్యూ డిల్లీ జాతీయ ప్లానింగ్ కమిషన్ నందు పిఆర్ఓ గా విధులు నిర్వహించి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామా చేసారు. విద్యార్థి దశ నుండే ప్రగతిశీల వామపక్ష ఉద్యమాల కీలకపాత్ర పోషిస్తూ డోలు దెబ్బ, యాదవ ఇంటలెక్షన్ ఫోరం, సామాజిక తెలంగాణ జాక్ ఏర్పాటు చేసి నిరణతరం ప్రజలను చైతన్యం చేయడమే కాకుండా దొడ్డి కొమురయ్య చిత్రాన్ని మొట్టమొదటగా చేయించిన వ్యక్తి, సత్యశోధక సామాజిక విద్యాపీఠం స్థాపించి ఎంతోమంది విద్యార్థులకు విద్యను అందించారు. గద్దర్ తో పాటు జననాట్యమండలిపై తన ఎంఫీల్ థీసిస్ ప్రజెంట్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బిఎస్పి పార్టీ జనరల్ సెక్రటరీగా కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేక ఉద్యమ సంఘాలతో కలిసి పని చేశారు. ఆ తర్వాత తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజం విభాగంలో ప్రొఫెసర్ గా తన సేవలను కొనసాగగించి పదవీ విరమణ పొందారు.
సామాజిక ఉద్యమకారుడిగా తెలంగాణ జన సేన స్థాపించి సామాజిక తెలంగాణ సాధన లక్ష్యంగా అహర్నిశలు పరితపించిన ప్రభంజన్ మండల్ టీవీ ని స్థాపించి సోషల్ మీడియా ఛానల్ ద్వారా ఉద్యమాలు చివరి వరకు కొనసాగిస్తూ తుది శ్వాస వరకు సామాజిక న్యాయం కోసం మేం ఎంతో మందిమో మాకు అంత వాటా నినాదంతో బహుజన ఉద్యమాన్ని నడిపిస్తూ అనేక సభలు సమావేశాలు నిర్వహించారు. బహుజన మీడియా, ద వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ లాంటి ఎన్నో పుస్తకాలను రచించి బ్రతికున్నంత కాలం విద్యార్థులకు, సమాజానికి ఉపయోగపడినట్లే తన మరణానంతరం కూడా వైద్య విద్యార్థులకు తన శరీరం ఉపయోగపడాలనే సామాజిక స్పూర్తితో చివరగా తన భౌతిక దేహాన్ని సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనగాం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కి సమర్పించారు.
ప్రభంజన్ మహోన్నతమైన ఆశయాన్ని కొనియాడుతూ వారి ఆశయాన్ని గౌరవించి నెరవేర్చిన భార్య డాక్టర్ రేఖ, కుటుంబ సభ్యులు పార్దిన దేహాన్ని వైద్య కళాశాలకు ఇచ్చినందుకు పలువురు ప్రముఖులు అభినందించారు. కుమారులు విశ్వామిత్ర, సత్యశోధక్ సోదరులు రమేష్, శ్రీనివాస్, వీరాస్వామి, డాక్టర్ దాడబోయిన శ్రీకాంత్, బావలు రవీంద్ర, బద్రి, రాంచందర్, రాజయ్యలకు గ్రామ మాజీ సర్పంచులు పుల్లయ్య, కొంరయ్య పోతన చైతన్య వేదిక సభ్యులు మరియు సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ జాతీయ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి, వరంగల్ ఉమ్మడి జిల్లాల ప్రతినిధులు కర్రేటి శంకర్రావు, సి.హెచ్ దళపతి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.
ప్రభంజన్ పార్థీవ దేహాన్ని హైదరాబాద్ ఆసుపత్రి నుండి పాలకుర్తి మండలం గూడూరు గ్రామానికి తీసుకొచ్చి తను స్థాపించిన పాఠశాలలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. పాలకుర్తి నియోజకవర్గ ప్రజలే కాకుండా రాష్ట్ర నలుమూలల నుండి తరలివచ్చిన ప్రముఖులు ఆయనకు జోహార్లు తెలిపి ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ సాంస్కృతిక సారధి ఛైర్మన్ వెన్నెల గద్దర్, హిందూ మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు బత్తుల సిద్ధేశ్వర్లు, ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్, తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర కన్వీనర్ సోమ రామమూర్తి, సిపిఐ ఎం ఎల్ లిబరేషన్ పార్టీ జనగామ జిల్లా కార్యదర్శి గుమ్మడిరాజుల సాంబయ్య, రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చాపర్తి కుమార్ గాడ్గే, న్యాయవాది కదిరే కృష్ణ, వివిధ సంఘాల అధ్యక్షులు కొంగర నరహరి, అమరేందర్, పెండ్లి అశోక్ బాబు, కోలా జనార్దన్ గౌడ్, మల్లేష్, సామాజిక ఉద్యమకారులు డాక్టర్ రాపోలు సత్యనారాయణ, బీసీ సంక్షేమ సంఘం నాయకులు పులి గణేష్, సంఘీ వెంకన్న, సింగారం దీపక్, మాజీ దేవస్థానం చైర్మన్ చిలువేరి కృష్ణమూర్తి, తిరుమలగిరి సర్పంచ్ పుల్లయ్య, గూడూరు తాజా మాజీ సర్పంచ్ మంద కొమురయ్య, ఎదునూరి మదర్, మాన్యపు విజేందర్ తదితరులు ఆయన అంతిమ యాత్రలో పాల్గొని ప్రభంజన యాదవ్ ఆశయాల సాధనకై కృషి చేస్తామని నినదించారు.
జనగామ వైద్య కళాశాల వద్దకు టిఆర్ఎస్ నాయకులు డాక్టర్ చెరుకు సుధాకర్, సీనియర్ పాత్రికేయులు కన్నా పరుశరాములు తదితరులు చేరుకొని నివాళులు అర్పించారు.
Comment List